ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఏపీలో రాజ‌కీయాలు ర‌ప‌వ‌త్త‌ర మ‌లుపు తిరుగుతున్నాయి. త్వరలో రానున్న పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తును ముమ్మరం చేశారు సీఎం చంద్రబాబు. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. నియోజకవర్గాల వారిగా అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే నరసాపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికపై పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈరెండు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించారు పార్టీ అధినేత. సిట్టింగ్‌ అభ్యర్ధులకే ప్రాధ్యానత్య ఇస్తూ.. తిరిగి వారికే అవకాశం కల్పించారు.నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంట అసెంబ్లీ అభ్యర్థిగా మంత్రి పితాని సత్యనారాయణను ఖరారు చేశారు.

పాలకొల్లుకు నిమ్మల రామానాయుడు, ఉండి నియోజకవర్గానికి శివరామరాజు నరసాపురం అసెంబ్లీకి మాధవనాయుడు, భీమవరానికి పులపర్తి రామాంజనేయులు, , తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణలను అభ్యర్ధులుగా చంద్రబాబు ప్రకటించారు. తాడేపల్లిగూడెం స్థానాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఈ స్థానానికి ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పోటీ పడుతున్నారు. దీంతో మరింత స్పష్టత వచ్చేవరకు నిర్ణయాన్ని వాయిదా వేశారు.మరో వైపు ఏలూరు పార్లమెంట్‌ పరిధిలోని అభ్యర్థులను ప్రకటించారు.

దెందులూరుకు చింతమనేని ప్రభాకర్‌, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా బడేటి బుజ్జి, ఉంగుటూరుకు గన్ని వీరాంజనేయులు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఖరారు చేసిన అభ్యర్థులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. సర్వే నివేదికలను అభ్యర్థుల చేతిలో పెట్టి తప్పొప్పులను వారికి వివరించారు. నియోజక వర్గాల్లో గట్టిగా తిరుగుతూ కష్టపడాలని హితబోధ చేశారు.