టీడీపీకి షాక్ ఇచ్చిన ఎంపీ అవంతి … వైసీపీ కి జంప్

విశాఖపట్టణం జిల్లా అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ ను కలవనున్నారు ఎంపీ అవంతి. పార్లమెంట్ నుంచి అసెంబ్లీపై కన్నేసిన క్రమంలో.. భీమిలీ అసెంబ్లీ సీటు ఆశించనున్నారు అవంతి. గన్ మెన్స్ ను కూడా అవంతి వెనక్కు పంపించేయటం.. ఆఫీస్ లో టీడీపీ జెండాలు తొలగించటంతో జగన్ పార్టీలో చేరటం ఖరారైపోయినట్లుగా తెలుస్తోంది. అవంతి శ్రీనివాస్ తో పాటు మరో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా వైసీపీలో చేరే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
కొద్దిరోజులుగా తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆయన.. పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో ఇక వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019, ఫిబ్రవరి 14 సాయంత్రం 4 గంటలకు లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం, ఎంపీ అవంతి టీడీపీ నేతలకు టచ్ లో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు కూడా సమాచారం.
భీమిలి టికెట్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఖరారు అవుతున్నట్లుగా సమాచారం అందుకున్న అవంతి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో 2009లో పీఆర్పీ తరుపున అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. భీమిలి నియోజకవర్గంపై పట్టు సాధించుకున్నారు. 2014 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే చంద్రబాబు అనకాపల్లి ఎంపీగా పోటీకి ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భీమిలి టికెట్ పై హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.