హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌పై జోరుగా బెట్టింగ్‌లు..!

నువ్వా..? నేనా..? అన్నట్టు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య జ‌రిగిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల స‌మ‌రంలో గెలిచేది ఎవ‌ర‌న్న‌ది మ‌రికొన్ని గంట‌ల్లోనే తేల‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నంక‌ల్లా ఫ‌లితం వ‌చ్చేస్తుంది.

సూర్యాపేట వ్య‌వ‌సాయ మార్కెట్ యార్డులో కౌంటింగ్ నిర్వ‌హించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్ల‌ను చేస్తున్నారు. హుజూర్‌న‌గ‌ర్‌లో మొత్తం ఓట‌ర్లు 2,36,842 మంది ఉంటే 2,00,754 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. 1,01,698 మంది మ‌హిళ‌లు 99,056 మంది పురుషులు ఓటేశారు. 84.76 శాతం పోలింగ్ జ‌రిగింది. మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిల‌క శాతం క‌న్నా ఇది త‌క్కువే.

2018 డిసెంబ‌ర్‌లో 95.96 శాతం న‌మోదైంది. ఈ సారి అత్య‌ధికంగా న‌ల్ల‌బండ‌గూడెంలో 93.48 శాతం, అత్య‌ల్పంగా నేరేడుచ‌ర్ల‌లో 56.27 శాతం పోలింగ్ జ‌రిగింది. ఉప ఎన్నిక‌ల్లో ఈ స్థాయి పోలింగ్ జ‌ర‌గ‌డంతో గెలుపోట‌ముల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పోటీ మ‌రీ ప్ర‌చారం చేయ‌డ‌మే.

ఇటు టీఆర్ఎస్‌, అటు కాంగ్రెస్ అభ్య‌ర్ధులిద్ద‌రూ గెలుపుపై ధీమాగా ఉండ‌టంతో అంచ‌నాలు మ‌రింత పెరిగిపోతున్నాయి. హుజూర్‌న‌గ‌ర్ ఎవ‌రి అడ్డా కానుంద‌న్న దానిపై జోరుగా బెట్టింగ్‌లు జ‌రుగుతున్నాయి. ఉమ్మ‌డి న‌ల్గొండ కాకుండా ప‌క్క‌నున్న ప్రాంతాల్లోనూ పందేలూ కాస్తున్న‌ట్టు నిఘా వ‌ర్గాల‌కు స‌మాచారం అందింది. ఎవ‌రు గెలుస్తారు..? ఎవ‌రికెంత మెజార్టీ వ‌స్తుంది..? ఏ అభ్య‌ర్ధికి ఎన్ని ఓట్లు వ‌స్తాయి..? ఇలా ప‌లు ర‌కాలుగా బెట్టింగ్‌లు కాస్తున్నారు పందెం రాయుళ్లు.