పుల్వామా దాడి నేపథ్యం.. సైనికులకు కేంద్రం గుడ్ న్యూస్..

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సైనికుల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఢిల్లీ – శ్రీనగర్‌, శ్రీనగర్ ‌- జమ్మూ మార్గాల్లో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది విమానాల్లో వచ్చి వెళ్లే సౌకర్యం కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు కేవలం అధికారులకు మాత్రమే విమాన ప్రయాణ సౌకర్యం ఉండేది. సైనిక సిబ్బంది సెలవుపై వెళ్లేందుకు, తిరిగి విధుల్లోకి వచ్చేందుకు విమాన ప్రయాణ సౌకర్యం పొందనున్నారు. తాజా నిర్ణయంతో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు సహా సీఆర్‌పీఎఫ్‌లోని 7 లక్షల 80 వేల మంది లబ్ధి పొందనున్నారు. ఇంతకు ముందు వీరికి విమాన సౌకర్యం ఉండేది కాదు.
ఈ నెల 14న 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఈ నియమాలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. 2500 మందికి పైగా సైనిక సిబ్బంది 70 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కాగా కేంద్ర పారామిలటరీ బలగాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రయాణ సౌకర్యాలకు అదనంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రమంగా ఈ సౌకర్యాన్ని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తామని కేంద్ర హోంశాఖ తెలిపింది. సైనికులు ప్రయాణంలో తమ సమయం ఆదా చేసుకునేందుకు, సెలవు ముగిశాక ఇంటి నుంచి త్వరగా విధులకు హాజరయ్యేందుకు కొత్త ఆదేశాలు ఉపకరించనున్నాయి.