గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే..

ఏపిలో రాజకీయం హీటెక్కింది. అన్ని పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎవరికి వారు గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. రోజూ ఒకటి లేదా రెండు పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష జరిపి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకు వస్తున్నారు. నేతలతో విడివిడిగా సమావేశం అయిన సమయంలోనే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉందా లేదా అనే విషయంలో స్ఫష్టత ఇచ్చి పంపిస్తున్నారు. ఇప్పటికే కడప, రాజంపేట, విజయవాడ, మచిలీపట్నం, కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష జరిపిన చంద్రబాబు… శనివారం బాపట్ల పార్లమెంటుపై ఫోకస్‌ చేశారు.బాపట్ల పార్లమెంటు అభ్యర్ధితో పాటు దాని పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై కూడా చంద్రబాబు సమీక్షించారు. ఈ పార్లమెంటు పరిధిలో ఉండే అద్దంకి, పర్చూరు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యేగా అనగాని సత్య ప్రసాద్, వేమూరు నియోజకవర్గం నుంచి నక్కా ఆనంద్‌ బాబు పోటీ చేయనున్నారు. చీరాల, సంతనూతల పాడు, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గాలపైనే పీఠముడి నెలకొంది..

ఇటీవలే చీరాల ఎమ్మెల్యే గా ఉన్న ఆమంచి క్రిష్ణమోహన్ టీడీపీని వీడి వైసిపిలో చేరడంతో ఇప్పడు ఈ నియోజక వర్గానికి అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలి అనేదానిపై చంద్రబాబు అభిప్రాయ సేకరణ జరిపారు. ఆమంచిని ఎదుర్కోవాలంటే సీనియర్ నేత కరణం బలరామే కరెక్ట్‌ అని అందరూ చంద్రబాబుకు తెలిపారు. ఆమంచి పార్టీని మోసం చేసి వెళ్లాడు. అలాంటివారికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ది చెప్పాలంటే బలమైన అభ్యర్ధినే నిలబెడతా మీరంతా గెలిపించండి అంటూ చంద్రబాబు వారికి స్ఫష్టం చేశారు. దీంతో చీరాల అభ్యర్ధిగా కరణం బలరాం వైపే బాబు మొగ్గు చూపుతున్నాట్టు తెలుస్తోంది. ఇక బాపట్ల విషయానికి వస్తే అక్కడ ఎమ్మెల్సి గా అన్నం సతీష్ ప్రభాకర్ ఉన్నారు. 2014లో స్వల్ప తేడాతో ఆయన వైసిపి చేతిలో ఓడిపోయారు. అనంతరం చంద్రబాబు సతీష్ కు ఎమ్మెల్సి ఇచ్చి అదే నియోజక వర్గానికి ఇన్ ఛార్జిగా కొనసాగించారు చంద్రబాబు.

అయితే బాపట్ల పార్లమెంటు పరిధిలోకానీ గుంటూరు జిల్లాలో కానీ ఉన్న ఏకైక కాపు సామాజిక వర్గానికి చెందని సీటు ఇది ఒక్కటే… ఈ నేపద్యంలో జిల్లాలో కాపుసామాజిక వర్గానికి సీటు ఇవ్వాల్సి వస్తే మరోసారి అన్నం సతీష్ వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇదే నియోజక వర్గానికి మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి, నరేంద్ర వర్మలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక సంతనూతల పాడు విషయానికి వస్తే ఇన్ ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ ఉన్నారు. అయితే ఇప్పడు ఉన్న పరిస్ధితుల్లో కూడా సంతనూతల పాడులో స్ధానికంగా కొందు ఆయన అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేఖిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అక్కడి పరిస్ధితుల ద్రుష్ట్యా విజయకుమార్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బాపట్ల ఎంపిగా మరోసారి సిట్టింగ్ ఎంపి మాల్యాద్రి కే అవకాశం దక్కవచ్చంటున్నారు. పార్లమెంటుల వరీగా అసెంబ్లీ సెగ్మెంట్లును ఒక్కో దాన్ని క్లియర్ చేస్తున్న చంద్రబాబు. స్ధానికంగా పార్టీ నాయకులనుండి వ్యతిరేఖత రాకుండా జగ్రత్తలు తీసుకుంటున్నారు.