భూమా అఖిల‌ప్రియ‌పై వేధింపులు.. క‌క్ష సాధింపు చ‌ర్యే..!

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబ స‌భ్యుల‌పై ఇటీవ‌ల కాలంలో వ‌రుస కేసులు నమోద‌వుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నికల నేప‌థ్యంలో ఆళ్ల‌గ‌డ్డ పోలింగ్ బూత్‌ల‌లో అఖిల ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్ రిగ్గింగ్‌కు పాల్ప‌డుతున్నారంటూ విమ‌ర్శి వ‌చ్చిన క్ర‌మంలో వైసీపీ – టీడీపీ శ్రేణుల మ‌ధ్య గొడ‌వ చెలరేగింది. దీంతో భార్గ‌వ్‌రామ్‌తోపాటు, టీడీపీ, వైసీపీ వ‌ర్గాల‌పై కేసులు న‌మోదు చేశారు. పోలీసులు.

ఇటీవ‌ల ఓ క్ర‌ష‌ర్ ఫ్యాక్ట‌రీ విష‌యంలో అఖిల‌ప్రియ కుటుంబ స‌భ్యుల‌తోపాటు పార్ట్‌న‌ర్‌గా ఉన్న శివ‌రామిరెడ్దిపై భార్గ‌వ్‌రామ్ హ‌త్యాయ‌త్నం చేశారంటూ మ‌రోకేసు న‌మోదైంది. ఆ కేసులో భార్గ‌వ్‌రామ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన క్ర‌మంలో హైద‌రాబాద్ పోలీసుల‌తో భార్గ‌వ్‌రామ్ త‌గాదా తీవ్ర దుమారం రేపింది. ఆ వ్య‌వ‌హారంపైనా మ‌రో కేసు న‌మోదైంది. ఇలా అఖిల ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్నాయి.

తాజాగా, భార్గ‌వ్‌రామ్‌ పై వ‌రుస కేసులు న‌మోద‌వ‌డాన్ని రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి శివ‌రామ‌కృష్ణ‌. ఈ రోజు మీడియా ముందుకొచ్చిన ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమర్శలు కురిపించారు. చంద్ర‌బాబు చేసిన మోసాన్నే జ‌గ‌న్ కొన‌సాగిస్తున్నార‌న్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను గోప్యంగా ఉంచ‌డం స‌రికాదని, అక్షిల‌ప‌క్ష స‌మావేశాన్ని ఏర్పాటు చేసి ఢిల్లీ వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌న్నారు. ఢిల్లీలో ఎంపీల‌కు ఇస్తున్న గౌర‌వాన్ని కూడా ముఖ్య‌మంత్రికి ఇవ్వ‌కపోవ‌డాన్ని ఏ కోణంలో చూడాలో చెప్పాల‌న్నారు సీపీఐ రామ‌కృష్ణ‌.