పొత్తులు, ప్రత్యేక హోదా విషయంలో జగన్ క్లారిటీ ఇదే

jagan,ysrcp

రానున్న ఎన్నికలు ఏపీలో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు కావడంతో ఎవరికి వారు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఏపీలో టఫ్ ఫైట్ కొనసాగనున్న నేపథ్యంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని పలు సర్వేలు తేల్చాయి. దీంతో పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని టిడిపి జనసేన స్నేహహస్తాన్ని కోరుతోంది. అయితే వైయస్ జగన్ మాత్రం పొత్తుల విషయంలో తన వైఖరిని తెలియజేశారు.

రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. మాటలు నమ్మి ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకుంటే మోసపోతామని తెలిపారు. 25 ఎంపీ సీట్లు ప్రజలు మన పార్టీకి ఇస్తారని , కేంద్రంలో ఏపార్టీకి పూర్తి మెజార్టీ రాదని , హంగ్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. `ప్రత్యేక హోదా వస్తుంది , రైల్వేజోన్ కూడా వస్తుంది. ఎన్నికలకు ముందు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం. ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే మద్దతు ఇస్తాం` అని వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా నమోదైన కేసుల ఎత్తివేతలోనూ చంద్రబాబు పక్షపాతం చూపారని అన్నారు.

అధికారంలోకి రాగానే ప్రజా ఉద్యమాలు , ఆందోళనలు , ధర్నాల కారణంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు ప్రతి 50 కుటుంబాలకు రూ. 5 వేల జీతంతో ఒకరిని నియమిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని తెలిపారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో రూ. 75 వేలు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. గ్రామ సెక్రటేరియట్ ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని తెలిపారు. కియా ఫ్యాక్టరీ ఘనత చంద్రబాబు తీసుకున్నా సరే గానీ.. అందులో 5 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన, ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో 10 మంది కి ఉద్యోగాలు కల్పిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.
మొత్తానికి జగన్ ఎన్నికల వ్యూహంలో చాలా క్లారిటీతో ఉన్నారు.