జగన్ తో జూనియర్ ఎన్టీఆర్ మామ భేటీ..!!

ఎన్నికల ముందు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ చేస్తున్న హడావుడి అంతాఇంత కాదు. అధికార టీడీపీకి వరుస షాకులిస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. మరికొందరు నేతలు వైసీపీలో చేరడానికి సిద్ధమంటూ వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ శ్రేణులకు బిగ్ షాక్ ఇచ్చే న్యూస్ వచ్చింది. హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ అధినేత జగన్ ను కలిశారు. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ఆయనతో భేటీ అయ్యారు. ఏపీలోని రాజకీయ అంశాలపై ఇరువురూ చర్చించినట్టు తెలుస్తోంది. వైసీపీలోకి భారీ ఎత్తున చేరికలు జరుగుతున్న తరుణంలో.. వీరిద్దరూ భేటీ కావడంతో ఈ భేటీ అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే, ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని మీడియాతో మాట్లాడుతూ నార్నె తెలిపారు. కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిశానని చెప్పారు. జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని… ఈ క్రమంలోనే ఆయనను కలిశానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీలోకి నార్నె శ్రీనివాసరావు చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలో చేరలేదు. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు ఆయన జగన్ ని కలవడంతో, ఆయన పైకి చెప్పకపోయినా వైసీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.