హుజూర్‌నగర్‌లో నేడు కేసీఆర్ కృతజ్ఞత సభ…!

కాంగ్రెస్ కంచుకోట హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానం మొన్న ఉప ఎన్నిక గెలుపుతో ఈ స్థానం కూడా టీఆర్ఎస్ ఖాతాలోకి పడిపోయింది. కాగా గత డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు. ఇక అనంతరం ఆయన నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందడంతో ఈ నెల 21వ తేదిన ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే.

అయితే మొన్న వెలువడిన ఫలితాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిపై 43,284 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే ఈ ఉప ఎన్నికకు ప్రచారానికి పోవాలని కేసీఆర్ అనుకున్నప్పటికి వర్షం కారణంగా సభ రద్దైన సంగతి తెలిసందే. అయితే మొన్న ఫలితం వెలువడిన రోజునే సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా హుజూర్‌నగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ కట్టబెట్టినందుకు నేడు హుజూర్‌నగర్‌లో ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు సీఎం కేసీఆర్ హాజర్ కానున్నారు. అయితే ఇక్కడ మొదటి సారి టీఆర్ఎస్ గెలుపొందడంతో సీఎం కేసీఆర్ ఇక్కడ హామీల వర్షం కురిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సభా ఏర్పాట్లకు సంబంధించి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చూసుకుంటున్నారు.