వైసీపీలోకి మరో కీలక నేత..

కడప జిల్లా రాజకీయాలలో వీరశివారెడ్డిది ఒక ప్రత్యేకమైన శైలి. ప్రత్యర్థి పార్టీల నేతల నైనా – సొంత పార్టీ నేతలనైనా విమర్శించాల్సి వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా విరుచుకుపడే నేత ఆయన . ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండగా వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు. అయితే వైఎస్ కుటుంబానికి చెందిన ఇతర నేతలతో మాత్రం ఆయనకు సఖ్యత లేదు. కానీ రాజకీయంగా మరోసారి మరుగునపడిపోకుండా ఉండేందుకు గాను ఆయన జగన్ గూటికి చేరడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.2014 ఎన్నికలకు ముందు వీరశివారెడ్డి టీడీపీలో చేరినా ఆయనకు టిక్కెట్ రాలేదు. పుత్తా నరసింహారెడ్డికి టీడీపీ టిక్కెట్ రాగా ఆయన జగన్ బంధువు రవీంద్రనాధ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈసారి కూడా వీరశివారెడ్డికి టిక్కెట్ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆయన వైసీపీలో టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకున్నాకూడా ఆ పార్టీలో చేరి టీడీపీ ఓటమికి పనిచేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది.

వీరశివారెడ్డి 1994లో కమలాపురం నుంచి టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. 2004లో కూడా టిడిపి తరఫునే గెలిచారు. 2009లో కాంగ్రెస్లో చేరి గెలిచారు. 2014 నాటికి మళ్లీ టీడీపీలోకి వచ్చినా టిక్కెట్ రాలేదు. ఈసారి కూడా ఆయనకు నిరాశ తప్పదని సమాచారం. మరోవైపు పుత్తా  నరసిహారెడ్డి కూడా వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. అయినా ఆయనకే ఈసారి టిక్కెట్ ఇవ్వనున్నట్లు టీడీపీవర్గాల్లో వినిపిస్తోంది. దీంతో వీరశివారెడ్డి జగన్ పార్టీలో చేరుతారంటున్నారు.
    అయితే… ఇపుడు వైసీపీలోనూ వీరశివారెడ్డికి టిక్కెట్ వచ్చే అవకాశాలు తక్కువే. ప్రస్తుతం కమలాపూర్ నియోజకవర్గం నుంచి జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఆయన 73వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఈసారి కూడా ఆయనకే టిక్కెట్ రావొచ్చని అంచనా. దీంతో వీరశివారెడ్డి వైసీపీలోకి వెళ్లినా కమలాపురం టిక్కెట్ రావడం కష్టమే. అయినప్పటికీ చంద్రబాబు తీరుపై విసుగు చెందే ఆయన వైసీపీలోకి వెళ్లనున్నట్లు సమాచారం.