విరాట్‌ కోహ్లికి విశ్రాంతి…?

బంగ్లాదేశ్‌తో వచ్చే నెలలో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు గత కొన్నినెలలుగా విరామం లేకుండా ఆడుతోన్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. కాగా, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో పలువురు యువ క్రికెటర్లను పరిశీలించిన ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సెలక్షన్‌ కమిటీ, బంగ్లాదేశ్‌ పర్యటనకు సైతం అదే విధానాన్ని అవలంభించనున్నారు. బంగ్లాదేశ్‌ క్రికెటర్లు తమ సమ్మెను విరమించడంతో భారత పర్యటనకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ, బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జట్టును ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో కోహ్లికి విశ్రాంతి ఇవ్వాలనే సెలక్టర్లు చూస్తున్నారు. మరి ఒకవేళ కోహ్లి రెస్ట్‌ తీసుకోవాడానికి మొగ్గుచూపితే అతనికి విశ్రాంతి తప్పకపోవచ్చు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కోహ్లి ఆఖరిసారి విశ్రాంతి తీసుకున్నాడు. కాగా, చాలాకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న ఎంఎస్‌ ధోనిని ఎంపిక చేస్తారా, లేదా అనేది ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. తాను ఆడతానని ధోని సంకేతాలు పంపితే అతని ఎంపిక ఖాయం. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీ కూడా ధోనికి మద్దతుగా నిలవడంతో సెలక్టర్లు ఏం చేస్తారనేది చూడాలి మరి.