విజిల్ మూవీ రివ్యూ

తలపతి విజయ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపొందిన విజిల్ నేడు విడుదలైంది. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన విజిల్ మూవీలో విజయ్ సరసన నయనతార నటించగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మరి విరి కాంబినేషన్ లో విజిల్ మూవీ ఎంత వరకు అంచనాలను అందుకుందో చూద్దాం రండి.

కథ:

మైకేల్(విజయ్) తన చుట్టూ ఉన్న వారికి సాయం చేస్తూ, స్థానికులలో మంచి పేరున్న ఓ యువకుడు. కాగా తన మంచితనం వలన మైకేల్ కి స్థానిక రౌడీ ముఠాలతో వైరం నడుస్తూ ఉంటుంది. ఫుట్ బాల్ లేడీ టీం కోచ్ అయిన మైకేల్ మిత్రుడు ఓ సంఘటన వలన తీవ్ర గాయాలకు లోనవుతాడు, దీనితో మైఖేల్ ఆ లేడీ ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. లోకల్ రౌడీగా చలామణి అవుతున్న మైకేల్ ఫుట్ బాల్ టీం కోచ్ ఎలా అయ్యాడు? అతన్ని ఆ జట్టు సభ్యులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు ఈ మైకేల్ గతం ఏమిటీ? అతని సారథ్యంలోని ఫుట్ బాల్ టీం లక్ష్యం సాధించిందా? అనే సమాధానాలు తెరపై చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

దర్శకుడు అట్లీ విజయ్ మాస్ ఇమేజ్ ని ఓ స్థాయిలో తెరపై ఎలివేట్ చేశారు. మైదానంలో
ఫుట్ బాల్ ప్లేయర్ గా అతని వేగం, అలాగే ఎమోషనల్ సన్నివేశాలలో విజయ్ నటనతో కట్టిపడేస్తారు. యువకుడిగా , మధ్య వయస్కుడిగా రెండు భిన్న నేపధ్యాలతో నడిచే పాత్రలలో విజయ్ చూపించిన వైవిధ్యమైన నటన గురించి పొగడకుండా ఉండలేం. ఇక క్లైమాక్స్ లో జట్టులోని ప్రతి సభ్యురాలిని తన మాటలతో ప్రేరణ కలిగించి విజయం వైపు నడిపించే సన్నివేశాలలో విజయ్ నటన మూవికే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన విజిల్ మూవీలో వి ఎఫ్ ఎక్స్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలిగేలా వారు చేయడం విజయం సాధించారు. ఫుట్ బాల్ మ్యాచ్ లలో జరిగే ఉత్కంఠ రేపే సన్నివేశాలను వాస్తవానికి దగ్గరగా తెరపై ఆవిష్కరించడంలో వి ఎఫ్ ఎక్స్ బాగా ఉపయోగపడింది.

ఇక విజయ్ ప్రేయసిగా చేసిన నయనతార తక్కువ నిడివిగల పాత్రలో గుడ్ అన్నట్లుగా నటించారు. విజయ్ స్నేహితుడు పాత్రలో ఖదీర్ నటన పర్వాలేదు. రిచ్ విలన్ పాత్రలకు చక్కగా సరిపోయే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన విలన్ పాత్రలో అలరించారు. అలాగే విజయ్ ప్రత్యర్థి టీం కెప్టెన్ పాత్ర చేసిన అర్జున్ బజ్వా నటన ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతమని చెప్పాలి, మూవీని ఈ సన్నివేశాలు మరో స్థాయికి తీసుకెళ్లాయి.

టీం లోని ప్రతి సభ్యురాలి నేపధ్యం చెప్పిన విధానం, విజయం కోసం వారు తమను తాము మార్చుకున్న విధానం వంటి సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా అట్లీ చక్కగా తెరకెక్కించారు. ఇక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ అందించిన పాటలు, బీజీఎమ్ మూవీకి ప్రధాన బలంగా నిలిచాయి. ఆయన తన సంగీతంతో మూవీని మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో బీజీఎమ్ కట్టిపడేస్తుంది.

మైనస్ పాయింట్స్:

మూవీ ప్రధాన బలహీనత అందరికి తెలిసిన గత చిత్రాలను తలపించే కథను ఎంచుకోవడం. గతంలో వచ్చిన అనేక స్పోర్ట్స్ డ్రామాలకు విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ జోడించి అట్లీ తెరకెక్కించాడు. విమెన్ టీం ఫుట్ బాల్ కోచ్ గా విజయ్ మరియు జట్టు సభ్యుల మధ్య వచ్చే సన్నివేశాలు షారుక్ ఖాన్ నటించిన “చెక్ దే ఇండియా” మూవీని తలపిస్తాయి.

చాలా స్లోగా నడిచే మొదటి సగం మూవీ ఇంటర్వల్ వరకు వేగం అందుకోదు. ఇంటర్వెల్ కి కానీ ప్రేక్షకుడికి మూవీపై ఒక అవగాహన రాదు. విజయ్ హీరోయిజం మరియు మాస్ ఎలిమిమెంట్స్ తెరపై పేలినా, నయనతారతో వచ్చే లవ్ ఎపిసోడ్ ఏమాత్రం ఆసక్తి కలిగించవు. నిరుత్సహాంగా సాగే ఈ లవ్ డ్రామా మూవీకి అంతగా ఉపయోగపడలేదు.

తీర్పు:

మొత్తంగా చెప్పాలంటే విజిల్ మూవీ మాస్ ఎలిమెంట్స్ మరియు ఎమోషనల్ కంటెంట్ తో సాగే స్పోర్ట్స్ డ్రామా అని చెప్పొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆసక్తిగా సాగే సన్నివేశాలు, ఎమోషన్స్ తో ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ ని అట్లీ ఒక రేంజ్ లో తెరపై ప్రెసెంట్ చేశారు.తమిళ నేటివిటీ తో సాగే చాలా సన్నివేశాలు తమిళ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి అనడంలో సందేహం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకు కొంచెం రొటీన్ అన్న భావన రావొచ్చు. ఐతే ప్రేక్షకుడిని నిరాశపరిచే చిత్రం ఐతే కాదు. ఏదేమైనా విజిల్ మూవీ అందరూ చూడదగ్గ చిత్రమే.

Telugu Vilas Rating : 3.2 / 5